Friday, April 4, 2014

స్థిత ప్రజ్ఞ


మా విశాఖ సముద్రపు అలలు
ఎప్పుడు సొలసిపోవు,అలసిపోవు
మా కలలు,ఆశలు కూడా అంతే.

ఆకాశం కట్టుకున్న  అందమైన చీర
బంగారంలా మెరిసే సైకత రేణువులనేత
సంద్రపు చీరకు  పైట చెంగు.
అక్కడక్కడ వెండిదారపు నగిషీల
బుటాలు తెరచాపల తెప్పలు.

నడిచే సూరీడు తో పోటీ పడుతూ
నీలివర్ణ నీడలు
పగటి పూట పలు రంగులుతో
పైపైనే ఆ హంగుల కుచ్చీళ్ళు.
ఎంత రెచ్చగొట్టినా వేడి ఎక్కక పైట, గాలి విసురుతూ

సంద్రమ్మ కు ఎంత  గుంభనమో ,
చంద్రమామ ను చూడగానే  ఉరుకుల ఉత్సాహం
అమాంతం అందుకోవాలని ఆరాటం
 తనను ఆక్రమించి , పరుచుకున్న వెండి వెన్నెలతో
దోబూచుల పరాచికాలు, ఒకరిలో ఒకరిని చూసుకుంటూ

ఆ హృదయపు లోతులు తెలుసుకో తరమా?
ఆ గగనపు నీడలు అందుకోగలమా?
ఎందరకో ఖేదం,మరెందరికో మోదం నీ నైజం
గంగవో దొంగవో ఏమో,గానీ

మా ఆత్మీయ అంత తరంగానివి నీవు.
అలుపెరుగని ఆడంబరానివినీవు
అలజడి ఆర్తనాదాలు అలవాటు చేసుకున్న
ప్రకృతి ఒడిలో స్థిత ప్రజ్ఞ వు నీవు.

------------------------------------------

No comments:

Post a Comment