Friday, April 4, 2014

"ఏహి పస్సికో" (నిర్ధారించుకుని తెలుసుకో)

కలంతో వ్రాసిందో,
బలం తో వ్రాసినదో నాకు ఇష్టముండదు,
హృదయ లోతులలో ముంచి మనసుతో వ్రాస్తే తప్ప.

 నొసటితో వెక్కిరించే  పెదవులపై చిరునవ్వుల
తేనె పూత మాటలు నాకు ఇష్టముండదు
ఆత్మీయ స్పర్శను అందిచే పులకరింపు పలుకులైతే తప్ప .

కళ్ళతో చూసిందో,
చెవులకు వినిపించినదో
నమ్మశక్యం కాదు నాకు అస్సలు
కలుసుకునో,తెలుసుకునో,ఆస్వాదించో, అనుభవించో
అనుభూతి పొందే యోగినినేను, భోగిని నేను.
అంతే తప్పా?

స్థిత ప్రజ్ఞ


మా విశాఖ సముద్రపు అలలు
ఎప్పుడు సొలసిపోవు,అలసిపోవు
మా కలలు,ఆశలు కూడా అంతే.

ఆకాశం కట్టుకున్న  అందమైన చీర
బంగారంలా మెరిసే సైకత రేణువులనేత
సంద్రపు చీరకు  పైట చెంగు.
అక్కడక్కడ వెండిదారపు నగిషీల
బుటాలు తెరచాపల తెప్పలు.

నడిచే సూరీడు తో పోటీ పడుతూ
నీలివర్ణ నీడలు
పగటి పూట పలు రంగులుతో
పైపైనే ఆ హంగుల కుచ్చీళ్ళు.
ఎంత రెచ్చగొట్టినా వేడి ఎక్కక పైట, గాలి విసురుతూ

సంద్రమ్మ కు ఎంత  గుంభనమో ,
చంద్రమామ ను చూడగానే  ఉరుకుల ఉత్సాహం
అమాంతం అందుకోవాలని ఆరాటం
 తనను ఆక్రమించి , పరుచుకున్న వెండి వెన్నెలతో
దోబూచుల పరాచికాలు, ఒకరిలో ఒకరిని చూసుకుంటూ

ఆ హృదయపు లోతులు తెలుసుకో తరమా?
ఆ గగనపు నీడలు అందుకోగలమా?
ఎందరకో ఖేదం,మరెందరికో మోదం నీ నైజం
గంగవో దొంగవో ఏమో,గానీ

మా ఆత్మీయ అంత తరంగానివి నీవు.
అలుపెరుగని ఆడంబరానివినీవు
అలజడి ఆర్తనాదాలు అలవాటు చేసుకున్న
ప్రకృతి ఒడిలో స్థిత ప్రజ్ఞ వు నీవు.

------------------------------------------

Tuesday, April 1, 2014

నీవు-నేను

నీవు నేను వేరే కానీ
ఒకరికొకరం అన్యోన్య మిత్ర శోధము
నీ  బలాన్ని నేనయితే
నా బలహీనత నీవు.
కొమ్మా రెమ్మలా సహవాసం మనది
విడిపోవడము,చిగురించడమూ మనకు అలవాటే.
ప్రకృతి వసంతానికి లొంగిపోయినట్లు
నేను నీకు ఎప్పుడో లొంగిపోయాను.
ఉవ్వెత్తున పడిలేచే అలల కెరటానివి,
బురుగుల,నురగల బుడగలు అప్పుడే అప్పుడే
వెంటనే గిడుతూ మళ్లీ పుడుతూ నేను
నీ అంతరంగములో నిరంతర సంగీతాన్ని
నీవు నా కణాంతరాలలో 
శ్వాసిస్తున్నప్రాణ వాయువు వి...